Saturday, October 11, 2008

Great Person


Sree Potti Sreeramulu Garu
ప్రతీ సంవత్సరం నవంబరు 1 న మనమంతా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకుంటాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించడానికి ఒకే ఒక్క మహాత్ముడు కారణం. ఆయనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైనది.శ్రీరాములు లాంటి యోధులు ముందే జన్మించినట్లైతే భారత దేశానికి ఏనాడో స్వతంత్రం వచ్చి ఉండేదని మహాత్మా గాంధీ స్వయంగా అన్నారంటే ఆయన ఔన్నత్యం తెలుస్తుంది.
పొట్టి శ్రీరాములు గారు మార్చ్ 16, 1901 జున శ్రీ గురువయ్య మరియు మహాలక్ష్మమ్మ గార్లకు మద్రాసు లో జన్మించారు. వారి పూర్వీకులు నెల్లూరు జిల్లాకు చెందిన పటమటపల్లె కు చందిన వారు. 20 ఏళ్ల వయసు వరకు మద్రాసులో చదివారు. పిమ్మట బొంబాయి లో గల VJTI కళాశాలలో ఇంజినియరింగ్ చేశారు. ఆయనకు వెంటనే భారత రైల్వే లో మంచి ఉద్యోగం దొరికింది. నెలకు 250 రూపాయలు జీతం. ఈరోజుల్లో నెలకు లక్ష పైచిలక న్నమాట. నాలుగు సంవత్సరాలు రైల్వే లో ఉద్యోగం చేశారు. 1927 లో 25 ఏళ్ల వయసులోనే ఆయన భార్య, ఒక కొడుకుని ప్రసవించి చనిపోయింది.వెంటనే కొడుకు కూడా మరణిన్చాడు. కలత చెందిన ఆయన ఉద్యోగం మానేశారు.కొద్ది రోజుల్లో ఆయన తల్లి కూడా పరమపాదించారు.వెనువెంటనే జరిగిన విషాదాకరమైన సంఘటనలతో సతమతమై అన్నీ వదిలేసి గాంధీ మార్గం చేపట్టాడు. శభార్మాతీ ఆశ్రమంలోకి వెళ్లాడు.
గాంధేయ వాధి గా భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం లో, 1942 క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని గాంధీ గారితో పలు మార్లు జైలుకు వెళ్లారు.గాంధీ గారి ఆదేశం మేర కృష్ణా జిల్లాలో యెర్నేని సుబ్రమణ్యం గారు స్థాపించిన గాంధీ ఆశ్రమంలో చేరి, గ్రామ స్వరాజ్య స్థాపనకూ ఎంతో పాటు పడ్డారు. 1943 లో నెల్లూరు జిల్లాలో చెర్కా ల వాడుకకు తోడ్పడ్డారు.హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం నెల్లూరు లో మూడు సార్లు దీక్ష పూనారు. హరిజనుల హక్కుల కోసం మద్రాసు సర్కారుతో పోరాడారు. హరిజనోద్దరణకై ఎర్రటి ఎండలలో కూడా చెప్పుల్లేకుండా తిరిగిహరిజనుల హక్కులు సాధించి పెట్టారు. మహాత్మా గాంధీ హత్య తరువాత శ్రీరాములు గారిని ఆంధ్ర ప్రాంత గాంధీ జ్ఞాపకార్త సహాయ నిధికి అధ్యక్షుడిగా నియమించారు. భూదాం ఉద్యమం, గాంధీ ట్రస్ట్ , కస్తుర్బా ట్రస్ట్ లను కూడా పర్యవేక్షించారు. తెలుగు వారినించి ఎక్కువ స్పందన రాకాపోయే సరికి చాలా విచారించి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమవసరమని గట్టిగా నిర్ణయిన్చుకున్నారు.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగు వాళ్ళు 1910 నుండే పోరాటం ప్రారంభించారు. వందే మాతరం ఉద్యమంలో ఎందరో తెలుగు వాళ్ళు జైలుకెళ్ళారు. కృష్ణా జిల్లాలో నిడదవోలు సభతో ఉద్యమం ఊపందుకుంది. తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన పలు ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరియు అన్నీబిసెంట్,భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను విభజించాలని నిర్ణయిన్చారు.వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారత ప్రభుత్వం నియమించిని ధార్ కమిషన్ కూడా భాష ప్రయుక్తమైన రాష్ట్ర ప్రతిపాదనను తిరస్కరించింది. దేశమంతా ధార్ కమిషన్ ప్రతిపాదనను ఖండించారు. ప్రజల నాడి తెలుసుకొని 1948 లో జైపూర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య గార్లతో కమిటీని వేశారు. ఈ కమిటీ, మద్రాసు మినహా అన్ని తెలుగు ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ కొన్ని రాజకీయ శక్తుల ఆటంకం వల్ల ఇది కూడా జరగలేదు. 1951 ఆగస్ట్ 15 న స్వామి సేతురామ్ ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. నెహ్రూ ప్రభుత్వానికి ఇది నచ్చలేదు. 35 రోజుల దీక్ష తరువాత ఆచార్య వినోభా భావే ప్రోత్ బలంతో నెహ్రూ గారు ఆయనకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని నమ్మించి దీక్ష విరమింపజేశారు. కానీ నెహ్రూ మాట నిలుపుకోలేదు.ఇవన్నీ చూసి విసుగెత్తిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19 న,మద్రాసులో బలుసు సుబ్రమణ్యం గారింట్లో
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అందరూ శ్రీరాములు గారి దీక్ష కూడా కొద్ది రోజుల్లో విరమించే దీక్ష అని అనుకున్నారు. 20 రోజుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన పరిస్థితిని చూసి టంగుటూరి ప్రకాశం గారు చాలా భాదపడ్డారు. యెర్నేని సుబ్రమణ్యం గారు పలు మార్లు గుట్టుగా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీ రాములు గారి ఆరోగ్యం ఎంత క్షీణించినా
మనసు మాత్రం ధృడంగా ఉంచుకొని దీక్ష కొనసాగించారు. 56 రోజుల తర్వాత కోమా లోకి వెళ్లారు. రెండు రోజులు గాలి కూడా పీల్చడానికి కష్ట పడ్డారు.చివరికి 58 రోజుల నిరాహార దీక్ష తరువాత 1952 డిసంబరు 16 న
తుది శ్వాస వదిలారు.హుటాహుటిన యెర్నేని సుబ్రమణ్యం గారు,గాయకుడు ఘంటసాల గారు, మోపర్రు దాసు గారు అక్కడికి వచ్చారు. ఆక్షణమే అమరజీవి ని స్మరిస్తూ ఒక గాయాన్ని వ్రాసి పాడారు.ఆయన దేహాన్ని మద్రాసులో ఉరేగింపు తీశారు.మౌంట్ రోడ్డు కు రాగానే లక్షల జనాలు తండోపతండాలుగా పోగై శ్రీరాములు పేరుతో ఆర్తనాదాలు చేశారు.కొంత మంది కొపొద్రిక్థులై అక్కడ విధ్వంసం చేశారు. ఈ వార్త దావాలనంలా తెలుగు ప్రాంతాలకంతా వ్యాపించింది. నెల్లూరు నుండి విజయ నగరం వరకు జనాలంతా కోపంతో ఉరేగింపులు చేశారు.
అనకాపల్లి, విజయవాడలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు.
మద్రాసులో, ఆంధ్ర ప్రాంతాల్లో జన జీవన మంతా స్థంబించింది. ఎట్టకేలకు డిసంబరు 19, 1952న దేశ ప్రధాని అయిన నెహ్రూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకున్నారు.అక్టోబరు 1,1953 రోజున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం కోరలనుంచి విముక్తులైన మిగతా
తెలుగు వారందరితో నవంబరు 1, 1956 న హైదరాబాదు రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్నీ, స్ఫూర్తిని మనమంతా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది.

No comments: